స్వర్ణ ప్యాలెస్ ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2020 7:48 AM GMTవిజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లు మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. దీనిలో భాగంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఆరు చెక్కులు అందజేశామని, సాయంత్రం ముగ్గురికి మచిలీపట్నంలో చెక్కులు అందిస్తామన్నారు.. మరొకరికి కందుకూరు లో చెక్ అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యతా, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రమేష్ హాస్పిటల్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని నోటీస్ జారీ చేశాము. ఆ ఆస్పత్రిలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురుని అరెస్ట్ చేశాం’అని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా బారిన పడుతున్న జర్నలిస్టుల సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్ల నాని తెలిపారు.