ఏపీ వైద్య ముఖచిత్రం మారేలా జగన్ సర్కార్ నిర్ణయం
By సుభాష్ Published on 10 July 2020 10:34 AM ISTప్రభుత్వాలు ఏవైనా విద్య.. వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఈ రెండు రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఈ రెండు రంగాలకు సంబంధించి ప్రైవేటు సంస్థలు ఎంత భారీగా దోచుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేద.. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఈ రెండు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పుల కోసం ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రయత్నించింది లేదు.
ఇందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటివరకూ నిర్లక్ష్యానికి గురైన వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ తన బలహీనతను అధిగమించేందుక వీలుగా ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు సర్కారు వైద్య ఆరోగ్య రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కరోనా విరుచుకుపడిన వేళలో.. వైద్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమిటన్న విషయంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆలోచనలో పడ్డాయి.
ఇప్పుడున్న పరిస్థితిని సమూలంగా మార్చేందుకు వీలుగా.. రూ.16వేల కోట్లకు పైబడిన నిధులతో పెద్ద ఎత్తున ఈ రంగాన్ని మార్చాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా భారీ విజన్ ప్లాన్ ను సిద్ధం చేశారు.
దీని ప్రకారం ఇప్పటికే పదహారు మెడికల్ కాలేజీల్ని ఓపెన్ చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఒక సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి.. ఒక క్యాన్సర్ ఆసుపత్రితో పాటు.. ఒక మానసిక చికిత్సాలయం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.6,099 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక.. ఏరియా ఆసుపత్రులు.. కమ్యూనిటీ ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూ.1236 కోట్లను ఖర్చు చేయనున్నారు. పీహెచ్ సీల్లో కొత్త వాటి నిర్మాణానికి.. ఇప్పటికే ఉన్న వాటి పునరుద్ధరణకు రూ.671 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక.. విలేజీల్లో క్లినిక్స్ ను పునరుద్దరణకు కొత్త వాటి కోసం రూ.1745కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్లాన్ కు తగ్గట్లు నిధులు సమీకరించే పనుల్ని షురూ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్యం కోసం ఒకరాష్ట్రం ఇంత భారీగా నిధులు కేటాయించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. జగన్ అనుకున్నట్లే హెల్త్ ప్లాన్ వర్క్ వుట్ అయితే మాత్రం హెల్త్ సెక్టార్లో రాష్ట్ర రూపురేఖలు మొత్తంగా మారిపోవటం ఖాయం.