వెలుగులోకి 'జగతి' అవినీతి.. జాస్తి కృష్ణ కిశోర్ సస్పెండ్..!
By అంజి Published on 14 Dec 2019 12:54 PM ISTముఖ్యాంశాలు
- అవినీతి అంశాలను బయటపెట్టారనే కృష్ణ కిశోర్ సస్పెన్షన్: చంద్రబాబు
- మార్షల్స్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న చంద్రబాబు
- ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: చంద్రబాబు
అమరావతి: ఆర్థిక అక్రమాలను వెలికి తీసినందుకే ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ విధులు నిర్వర్తించారు. జగతి పబ్లికేషన్స్‌లో అవినీతిని బయటపెట్టినందుకే సీఎం జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ వచ్చారని.. ఆయన 27 ఏళ్ల సర్వీసులో ఎక్కడా కూడా చెడ్డ పేరు రాలేదన్నారు.
హైదరాబాద్‌లో జగతి పబ్లికేషన్స్ షేర్ విలువ రూ.10 ఉంటుందని, రూ.122 కోట్ల పన్ను చెల్లించాలని జాస్తి కృష్ణ కిశోర్ నివేదిక ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి మండలి ఎలాంటి భూములు కేటాయించదని, ప్రోత్సహకాలు ఇవ్వదని తెలిపారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మాత్రమే ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయనను విధుల నుంచి తప్పించారు. తర్వాత కూడా ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తనను రిలీవ్ చేస్తే కేంద్ర సర్వీసులకు వెళ్తానని కృష్ణ కిశోర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయనను ప్రభుత్వం రిలీవ్ చేయలేదు.
జైలులో జగన్‌తో ఉన్నవారికి ఉన్నత పదవులు కల్పించారని.. సహా నిందితులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జాస్తి కృష్ణ కిశోర్ సస్పెండ్ విషయాన్ని సభలో లెవనేత్తుతామన్న భయంతోనే మార్షల్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. శాసన సభలో మార్షల్స్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. వీడియోలో ఉన్మాది అన్నట్లు ఉందని.. అది అభ్యంతర పదం కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాజకీయ వివాదాల్లోకి రావొద్దని ఉద్యోగులను కోరుతున్నానన్నారు. వీడియోలో ఏదైనా అసభ్య పదజాలం ఉంటే చెప్పాలని సవరించకుంటాని చంద్రబాబు తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన తనను అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తనను చీఫ్ మార్షల్ గుర్తు పట్టలేదా?, అక్కడేమైనా అత్యవసర పరిస్థితులు ఉన్నాయా? అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. తమ వద్ద ఫ్లెక్సీలు, ప్లకార్డులు, ప్రశ్నోత్తరాలు కూడా లేవన్నారు. అక్రమాస్తుల కేసులను విచారించిన వాళ్లను సీఎం జగన్ టార్గెట్ చేశారని చంద్రబాబు అన్నారు.