అచ్చెన్నాయుడి అరెస్ట్ పై స్పందించిన చంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2020 9:52 AM ISTమాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైన జరిగితే అందుకు సీఎం జగన్‌దే పూర్తి బాధ్యత అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలపై పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడుగారు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారు. ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్ అందుబాటులో లేదు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు... పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారు.
ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీయం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటి? బహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించారు... బీసీ సబ్‌ప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు... ముఖ్యమైన నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు... సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. వీటన్నింటినీ శాసనసభా వేదికగాను, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్ చట్టవ్యతిరేకంగా కిడ్నాప్ చేశారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.