మండలిపై చంద్రబాబు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

By అంజి  Published on  27 Jan 2020 11:05 AM GMT
మండలిపై చంద్రబాబు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో మండలి రద్దుపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. చర్చల అనంతరం సభ వాయిదా పడనుంది. 2004లో చంద్రబాబు శాసనమండలి వద్దు అని వ్యతిరేకించిన స్పీచ్‌ను అసెంబ్లీలో ప్రదర్శించారు. మండలి వల్ల డబ్బు, సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం లేదని ఆనాడు సభలో చంద్రాబు ప్రసగించారు. ప్రజలు కట్టే పనులు మండలి కోసం వెచ్చించడం సరికాదన్నారు, శాసనమండలి వలన అధికారంలో ఉన్న పార్టీకే ఉపయోగం తప్ప.. ప్రజా ప్రయోజనాలు నెరవేరవు అని అన్నారు.

2004న జులై 8న అసెంబ్లీలో మండలి ఏర్పాటుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. 2004లో ప్రభుత్వ ప్రతిపాదనపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవులు, అధికారం కోసం కాంగ్రెస్‌ వాళ్లు ఆత్రంగా ఉన్నారంటూ ఆనాడు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారని, కేవలం పదవుల కోసం మండలిని పునరుద్దరించారన్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదని, ఒకప్పుడు చదువుకున్న వాళ్లు తక్కువ కాబట్టి పెద్దల సభ అవసరమైందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది, అనుభవం ఉందని.. మండలి వస్తే శాసనాలు పాస్‌ కావడంలో ఆలస్యం అవుతోందన్నారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మాన్స్‌ఫర్ట్‌ కమిటీ కూడా చెప్పిందని చంద్రబాబు అన్నారు. 1930 రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా మండలిని వ్యతిరేకించిందన్నారు.

అక్టోబర్‌ 26, 1934న అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్‌ మండలిని వ్యతిరేకించారని తెలిపారు. మండలి వల్ల లాభం ఉండదు, నష్టం మాత్రమేనని రాజేంద్రప్రసాద్‌ అన్నారని 2004లో అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసనమండలి ఏర్పాటు కాగా, వాటిలో మూడు చోట్ల రద్దయ్యిందన్నారు. శాసనమండలి వల్ల ఆర్థిక భారం ఏకంగా ఏటారూ. 20 కోట్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్‌ లేదా తిప్పి పంపితే మళ్లీ కాలయాపన అవుతుందన్నారు. ఏ బిల్లయినా ఆపే అధికారం మండలికి కేవలం నాలుగు నెలలే ఉంటుందన్నారు. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.

1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటు అయితే అది ఒక పునారావస కేంద్రంగా మారిందని చంద్రబాబు అన్నారు. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నాయకులను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశ్యంతోనే మే31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారని చంద్రబాబు తెలిపారు. జనవరి 23,1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం దానిని తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలన్నారు. ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.

Next Story