9 నెలల్లో 180 అత్యాచారాలు.. నిందితుల్లో వైసీపీ వాళ్లే ఎక్కువ
By అంజి Published on 8 March 2020 2:41 PM IST
ముఖ్యాంశాలు
- వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
- రాజధాని అమరావతి కోసం మహిళలు దీక్షలు చేస్తున్నారు: చంద్రబాబు
- రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి: చంద్రబాబు
అమరావతి: వైఎస్ జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు, రాష్ట్రం సంతోషంగా ఉంటాయి. అందుకే గత ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో మహిళల ప్రగతి, ఆనందమే లక్ష్యంగా పనిచేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడింది.. అంటూ ట్వీట్ చేశారు.
రాజధాని అమరావతి కోసం 82 రోజులుగా మహిళలు దీక్షలు చేస్తున్నారు. వారి ఆందోళనకు ఈ ప్రభుత్వం చెబుతున్న సమాధానం అవమానాలు, అరెస్టులు, లాఠీదెబ్బలేనన్నారు. మరోవైపు రేషన్ కార్డులు, పింఛన్లు పోయి ఎంతో మంది మహిళలు బతుకు బెంగతో ఉన్నారు. ఇంకోవైపు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
'వైసీపీ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో 180 మంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో 33 మంది చిన్నారులు ఉన్నారంటే ఎంత అమానవీయమని అన్నారు. బాధితుల్లో బడుగువర్గాలవారు ఎక్కువగా ఉండగా,నిందితుల్లో వైసీపీవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దిశ చట్టం తెస్తే సంతోషించాం. కానీ సమాజాన్ని ఏ దిశకు తీసుకుపోతున్నారు?' అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. క్షమయా ధరిత్రీ అన్నారు కదా అని మహిళల సహనాన్ని అలుసుగా తీసుకుంటే, వైసీపీ ప్రభుత్వం వారి నుంచి గుణపాఠం నేర్చుకోక తప్పదు అంటూ విమర్శించారు. స్త్రీ మూర్తులందరూ ధైర్యంగా ఉండండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది.. చంద్రబాబు తన ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతిమ విజేతలు మీరే. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!.. అంటూ ట్విటర్‌లో చెప్పారు.