ఆన్‌లైన్‌ క్లాసులపై కేంద్రం కీలక నిర్ణయం

By సుభాష్  Published on  8 July 2020 9:31 AM IST
ఆన్‌లైన్‌ క్లాసులపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ జోన్లు, బఫర్‌ జోన్లలో జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సడలింపులు ఇస్తూ కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్‌లాక్‌-2 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పకుండా పాటించాలని సూచించింది.

ఈనెల 31 వరకు విద్యాసంస్థలన్నీ మూసివేయాలని తెలిపిన కేంద్రం.. ఆన్‌లైన్‌, దూర విద్య తరగతులను మాత్రం నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని తెలిపింది. అలాగే చిత్ర పరిశ్రమకు కూడా ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు.

కాగా, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. దీంతో ఈ విద్య సంవత్సరం విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడితే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగించినా.. కరోనా తగ్గకపోవడంతో ఇప్పట్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యే సూచనలేమి కనిపించడం లేదు. ఇక పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

Next Story