పల్లె ప్రజలపై కేంద్ర సర్కార్ సర్వే నిర్వహించబోతోంది. రాష్ట్రంలో గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్రం ఆరాతీయబోతోంది. పదేళ్ల కాలంలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక, సామాజిక, కుల గణన పేరిట ఇంటింటా సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన పదేళ్లలో ప్రజలు అందుకున్నకనీస వసతులు, సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, తదితర అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనుంది. ఈ మేరకు గ్రామీణ వారీగా వివరాలు సేకరించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్‌14 కల్లా వివరాలు సేకరించాలి

ఈ ఏడాది ఏప్రిల్‌14వ తేదీకల్లా రాష్ట్ర పంచాయతీరాజ్‌ సహకారంతో వివరాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం 16 ప్రామాణికాలను నిర్దేశించిన ప్రభుత్వం.. సమాచారాన్నిసేకరించాలని ఆదేశించింది. జీవిత బీమా, బ్యాంకు ఖాతా, వంట గ్యాస్‌ కనెక్షన్‌, విద్యుత్‌ కనెక్షన్‌ లాంటివి ఉన్నాయా లేదా అనే అంశాలను తెలుసుకోనున్నారు.

ఇక గర్భిణులు, ఆరు సంవత్సరాల్లోపు చిన్నారుల సమాచారం, పిల్లలకు ఇచ్చే టీకాల వివరాలు, పౌష్టికాహార లభ్యతలకు సంబంధించిన వివరాలు సర్వే ద్వారా నమోదు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే సరైన ఆరోగ్య సేవలు అందుతున్నాయా..? ప్రాథమిక పాఠశాల సౌకర్యం ఉందా..? కుటుంబ సభ్యులు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారా..? సొంత ఇళ్లు ఉన్నాయా?, లేక అద్దె ఇంట్లో ఉంటున్నారా..?, ప్రతి నెల ఆదాయం ఎంత వస్తోంది.. సామాజిక పింఛన్‌ అందుతోందా..?, ఆయుష్మాన్‌ భారత్‌ కింద హెల్త్‌ కార్డు మంజూరైందా..? లేదా.. అనే వివరాలను సేకరించనున్నారు అధికారులు.

సర్వే కోసం ప్రత్యేక యాప్‌

కేంద్రం నిర్వహించే సర్వే కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించనుంది. గ్రామీణ ప్రాంత ప్రజల వివరాలను నమోదు చేసుకునేందుకు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది. ఈ సర్వేలో పదేళ్లలో ప్రజలకు ఏ మేరకు సౌకర్యాలు, సేవలు ఏ మేరకు అందాయనే వివరాలు సేకరించనుంది

సర్వే ఆధారంగా కొత్త వాటికి రూపకల్పన

ఈ సర్వే ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకోనుంది. ఈ వివరాల ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. వివరాలు సేకరించిన అనంతరం పథకాల అమలు తీరుపై సమీక్షించి కొత్త వాటికి రూపకల్పన చేయనుంది కేంద్రం. ఈ సారి నిర్వహించే సర్వేలో ఇంటి యజమాని మొబైల్‌ నంబర్‌ను కూడా ప్రభుత్వం తీసుకోనుంది.

సుభాష్

.

Next Story