ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ సాధ్యం కాదట.. చెప్పిందెవరంటే?
By Newsmeter.Network Published on 5 July 2020 6:20 AM GMTమాయదారి రోగం పుణ్యమా అని కొందరు మస్తు పాపులర్ అయ్యారు. ఐసీఎంఆర్.. సీసీఎంబీ లాంటివి ఉంటాయన్న విషయం సామాన్య ప్రజలకు తెలీటమే కాదు.. వాటి డైరెక్టర్లు ఇప్పుడు పాపులర్ గా అయ్యారు. వారి మాటల్ని ప్రజలు పట్టించుకోవటమే కాదు.. వారు ఏ అంశాల మీద ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది నిశితంగా పరిశీలస్తున్నారు. వచ్చే నెల 15న మాయదారి రోగానికి వ్యాక్సిన్ వచ్చేయనుందని.. దీంతో మహమ్మారి కష్టాలు తొలిగినట్లేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఇందులో భాగంగా వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించిన సెంటర్లను ప్రకటించారు. ఇదిలా ఉండగా..అందరూ అంటున్నట్లు పంద్రాగస్టుకు వ్యాక్సిన్ చేయటం సాధ్యం కాదని తేల్చేశారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది తొలినాళ్లలో వ్యాక్సిన్ వచ్చే వీలుందని చెప్పారు. ఒక వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తేవటానికి ముందు భారీ స్థాయిలో క్లినికల్ టెస్టులు జరగాల్సి ఉందన్నారు.
పంద్రాగస్టుకు వ్యాక్సిన్ తేవాలన్న పట్టుదలతో సీఎస్ఐఆర్ ఉన్న వేళ.. రాకేశ్ మిశ్రా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వ్యాక్సిన్ వివిధ ప్రక్రియల్లో జరగాల్సిన వేళ.. హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏమిటంటూ కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కీలకమైన క్లీనికల్ ట్రయల్స్ జరగకుండానే.. డేట్ ఫిక్స్ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
క్లీనికల్ ట్రయల్స్ ను భారీ ఎత్తున జరపాల్సి ఉంటుందని.. అనారోగ్యంతో ఉన్న వారికి మందుబిళ్ల ఇచ్చి.. తగ్గిందా? లేదా? అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదని.. వ్యాక్సిన్ అన్న సంగతి మర్చిపోవద్దని రాకేశ్ మిశ్రా పేర్కొంటున్నారు. ఒక వ్యాక్సిన తయారుచేయటానికి కొన్నేళ్లు పడుతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగంగా వ్యాక్సిన్ రూపొందించటానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పారు. తనకున్న అంచనా ప్రకారం వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడాయన మాటలు సంచలనంగా మారాయి.