గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణకు ఆదేశం.. అసలు విషయం రాబట్టేందుకే..
By అంజి
అమరావతి: ఏపీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
కొంతమందిని అకారణంగా కిడ్నాప్ చేసి హింసిస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసులకు గట్టి షాక్ ఇచ్చింది.
గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకుల అదృశ్యం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదృశ్యం అయిన వారిని రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నప్పుడే పోలీసులు దాడి చేసి తీసుకెళ్లారని బంధువుల ఆరోపించారు. అదృశ్యం అయిన వారిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు.
15 రోజులు గడిచిన కూడా ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వారిపై క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ముగ్గురు యువకులను అరెస్ట్ చేయకుండా చిత్రహింసలు పెట్టడంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. కాగా పోలీసులు విచారణ నివేదికకు.. జ్యుడియల్ నివేదికకు చాలా తేడా ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని రాబట్టేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశించటం.. పోలీస్ శాఖలో హాట్ టాఫిక్‌గా మారింది. జ్యుడియల్ విచారణకు పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకంగా డీజీపీ కూడా కోర్టు ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది.