కులం అనే జబ్బు గురించి ట్వీట్లు చేసిన రామ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 3:53 PM GMT
కులం అనే జబ్బు గురించి ట్వీట్లు చేసిన రామ్

కోవిడ్ కేర్‌ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ వాదన ఒకలా ఉంటే.. ఆసుపత్రి యాజమాన్యం వాదన మరోలా ఉంది. విచారణలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం అధికంగా బిల్లులు వసూలు చేసినట్లు కూడా కథనాలు వస్తున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలీకుండా ఆయన వెనుక ఉన్న వాళ్లు ఏదో చేస్తున్నారని హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. “ఏపీ గమనిస్తోంది” అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.

‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ అని ప్రశ్నించారు రామ్.

తాము ఎంతో తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు జరుపుతున్నామని, ఆటంకం కలిగించాలని చూస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు ఇస్తామని రమేశ్ ఆసుపత్రి వ్యవహారంపై ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో స్పష్టం చేశారు. ఆ తర్వాత రామ్ నుండి “నాకు న్యాయంపై నమ్మకం ఉంది. నిజమైన దోషులు ఎవరైనా, ఎవరికి చెందినవారైనా తప్పకుండా శిక్షించబడతారని కచ్చితంగా చెప్పగలను. ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయాలనుకోవడంలేదు. ఈ వ్యవహారంలో చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశాను” అని ట్వీట్ వచ్చింది.

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం రామ్ కు బంధువులే కావడంతోనే ఈ ట్వీట్ చేశారని పలువురు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ వేశారు. రామ్ ఓ కులానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ మరికొందరు వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కులాలకు సంబంధించిన పోస్టులపై రామ్ తాజాగా స్పందించారు. 'సోదర సోదరీమణులారా కరోనా వైరస్ కంటే వేగంగా కులం అనే జబ్బు విస్తరిస్తుంది. అది కరోనా కంటే భయంకరమైనది, ప్రమాదకరమైనది. సైలెంట్ గా విస్తరించే దీని బారిన పడకండి. ఇందులోకి లాగాలని ఎవరైనా ప్రయత్నించినా దీని ఉచ్చులోకి పడొద్దు' అని ట్వీట్ చేశాడు. అందరూ కలిసికట్టుగా మంచి కోసం పాటుపడదాం అని రామ్ చెప్పుకొచ్చారు.

Next Story