సీఏఏపై స్టే ఇవ్వం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

By అంజి  Published on  22 Jan 2020 7:30 AM GMT
సీఏఏపై స్టే ఇవ్వం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా 144 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లైంది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై తమ స్పందన తెలియజేసేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి 4 వారాల గడువుతో పాటు నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటి వరకు సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం సృష్టం చేసింది. సీఏఏను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రత్యేక విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సూచన చేసింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఐదు వారాల తర్వాత విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

సీఏఏ అమలుపై స్టే విధించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టానికి అనుకూలంగా కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిన్నిటిపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని బాబ్డే స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన పిటిషన్లలో తమకు 60 కాపీలు మాత్రమే అందాయన్నారు. మిగతా వాటిపై స్పందన తెలియజేసేందుకు మరింత గడువు కావాలని కోరారు. కాగా సీనియర్‌ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. సీఏఏ అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Next Story