టిక్ టాక్.. భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందా.?
By Medi Samrat Published on 10 July 2020 12:40 PM GMTఇండియా-చైనా దేశాల సరిహద్దు గొడవలు టిక్ టాక్ కొంప ముంచాయి. భారత్ వంటి భారీ మార్కెట్ ను ఆ యాప్ కు దూరం చేశాయి. చైనాతో ఘర్షణల కారణంగా కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్ లపై నిషేధం విధించగా.. వాటిలో టిక్ టాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ తనపై పడిన చైనా ముద్రను తొలగించుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. బీజింగ్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మరో చోటకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఎక్కడికి తరలిస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
అయితే.. టిక్‌టాక్ బీజింగ్ ప్రధాన కార్యాలయం తరహాలో.. ముంబయి, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, డబ్లిన్ నగరాల్లో కూడా భారీ కార్యాలయాలు ఉన్నాయి. అయితే.. ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉండడంతో టిక్ టాక్ యాప్‌పైన చైనా ప్రభుత్వం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనేక దేశాలు భావిస్తున్నాయి.
ఇదిలావుంటే.. టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు తాము కూడా సన్నద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో చైనా నుంచి బయటికి వచ్చేయడంతో పాటు, మాతృసంస్థ బైట్ డ్యాన్స్ లో కూడా భారీ మార్పులు చేయాలని బావిస్తున్నట్లు టిక్ టాక్ యాజమాన్యం పేర్కొంది.