ఏడుగురిపై అత్యాచారం.. కటకటాల్లో వ్యాపారవేత్త

By సుభాష్  Published on  15 Sep 2020 9:44 AM GMT
ఏడుగురిపై అత్యాచారం.. కటకటాల్లో వ్యాపారవేత్త

దేశంలో మహిళలపై, మైనర్‌ బాలికలపై, వృద్ధులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతిదినం అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్త ఏడుగురి మహిళలపై అత్యాచారం చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. అయితే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మహిళలు వెనుకడుగు వేయగా, ఓ 16 ఏళ్ల బాధితురాలు మాత్రం ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యాపారవేత్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ రియాజ్‌ ఇక్బాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

16 ఏళ్ల యువతిని సమీర్‌ అనే పేరుతో రెండేళ్ల కిందట వ్యాపారవేత్త పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని హెచ్చరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవాడు. అయితే నిందితుడి బాధ భరించలేక బాధితురాలు కొల్గావాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణ పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. సమీర్‌ అలియాస్‌ అతీక్‌కు రెండు పేర్లతో పాస్‌పోర్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బాధిత యువతితో పరిచయం కాకముందు పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి ఇదే విధంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు విచారణ తేలింది. అంతేకాకుండా ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆమెను వేరే మతంలోకి మార్చేసి, 2017లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడేవాడని తెలుస్తోంది. మహిళలతో కొంత కాలం సంబంధాలు కొనసాగించి , ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసేవాడని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి నకిలీ లెటర్‌ ప్యాడ్స్‌ దొరికాయని తెలిపారు. ఈ లెటర్‌ ప్యాడ్‌ల ద్వారా వీఐపీ కోటలో రైళ్లలో ప్రయాణించేవాడని తెలుస్తోంది. నిందితుడికి సంబంధించి నేరాలను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

Next Story