కాళ్లు, చేతులు కట్టేసి నడి రోడ్డుపై గొంతుకోసి దారుణ హత్య..!

By సుభాష్  Published on  14 Sep 2020 5:40 AM GMT
కాళ్లు, చేతులు కట్టేసి నడి రోడ్డుపై గొంతుకోసి దారుణ హత్య..!

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివాహేత సంబంధాలు, పగలు ప్రతీకారాలు, అత్యాచారాలు ఇలా ఎన్నో విధాలుగా ప్రతి రోజు దారుణాలు లేని రోజంటూ ఉండదు. ఇక భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని కంచన్‌బాగ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కంచన్‌బాగ్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ సయ్యద్‌మునవర్‌ ఖాద్రి (27), చంద్రాయణగుట్ట డివిజన్‌ హాఫిజ్‌బాబాబానగర్‌ ప్రాంతానికి చెందిన యువతి (25) ప్రేమించుకుని ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల పాప, 24 రోజుల బాబు కూడా ఉన్నారు. అతనికి భార్య సోదరితో వివాహతర సంబంధం కొనసాగుతోంది.

ఈ విషయమై పలుమార్లు భార్యతో పాటు ఆమె తండ్రి, తమ్మడు ఖాద్రిని మందలించారు. ఆదివారం మాట్లాడుకుందామని హఫీజ్‌బాబానగర్‌కు పిలిచి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, వారి మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో అతని కాళ్లు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న సంతోష్‌నగర్‌ ఏసీపీ శివరామకృష్ణ శర్మ, కంచన్‌బాగ్‌ ఇన్స్‌పెక్టర్‌ జె. వెంకట్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలానికి క్లూస్‌ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. మరదలితో అక్రమ సంబంధం కొనసాగించిన కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story