క్షమాపణలు చెప్పిన జొమాటో

Zomato Withdraws Hrithik Roshan Ad Amid Backlash. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.

By Medi Samrat  Published on  21 Aug 2022 8:15 PM IST
క్షమాపణలు చెప్పిన జొమాటో

ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ నటించిన ప్రకటన హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఉజ్జయిని మహాకాళి దేవస్థానం అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనను జొమాటో వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉజ్జయినిలో ఆహార పళ్లెం ఉందని.. అందుకే మహాకాళి నుంచి ఆర్డర్ చేశానంటూ ప్రకటనలో హృతిక్ రోషన్ చెబుతుంటాడు.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. జొమాటో వెంటనే తన ప్రకటనను ఉపసంహరించుకుని, క్షమాపణలు కోరాలని ఆలయ పూజారులు మహేశ్, ఆశిష్ డిమాండ్ చేశారు. మహాకాళి ఆలయం చైర్మన్ గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ ను అర్చకులు సంప్రదించారు. జొమాటోకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ స్పందిస్తూ.. జొమాటో ప్రకటన తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. ఆలయం ఉచిత ఆహారాన్ని ప్రసాదంగా అందిస్తోందని, దీన్ని విక్రయించడం లేదని చెప్పారు.

ఈ వివాదాస్పద ప్రకటన విషయంలో జొమాటో క్షమాపణలు చెప్పింది. ఉజ్జయిని మహాకాళేశ్వరం పూజారుల డిమాండ్ మేరకు ప్రకటనను సరిచేయడమే కాకుండా, జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా కోరింది. ఈ మేరకు జొమాటో ఒక ప్రకటన విడుదల చేసింది. ''ఉజ్జయిని ప్రజల మనోభావాలకు మేము ఎంతో గౌరవం ఇస్తాం. సంబంధిత ప్రకటన ఇక ఎంత మాత్రం కొనసాగదు. ఎవరి విశ్వాసాలు, మనోభావాలను గాయపరచడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు'' అని జొమాటో ప్రకటించింది.


Next Story