స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలిరోజే జొమాటో షేర్లు దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. 2020 తర్వాత ఐపీఓకి వచ్చిన సంస్థల్లో 50 శాతం ప్రీమియం లిస్టింగ్ సాధించిన 10 కంపెనీల జాబితాలో చేరింది. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో సెన్సెక్స్‌లో జొమాటో షేరు ధర 62 శాతం ఎగబాకి రూ.123.35 వద్ద ట్రేడవుతోంది. ఈ సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. జొమాటో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లను దాటింది. దీంతో బీఎస్‌ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన చేరింది.
ఫుడ్ డెలివరీ రంగానికి చెందిన ఓ కంపెనీ ఐపీఓకి రావడం ఇదే తొలిసారి కావడం.. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ నడుస్తుండడం జొమాటో దూకుడుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో 3.06 కోట్లుగా ఉన్న జొమాటో ఆర్డర్లు.. 2021 నాటికి 23.89 కోట్లకు పెరిగింది. మార్చి 2021 నాటికి భారత్‌లో 525 నగరాల్లో జొమాటో సేవలందిస్తోంది. మొత్తం 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో లిస్టయ్యాయి.