ఆగని అదానీ షేర్ల పతనం
Unstoppable fall in Adani Shares. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని చూస్తూనే ఉన్నాయి.
By Medi Samrat
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని చూస్తూనే ఉన్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసినా అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగలేదు. అదానీ గ్రూప్ లో ఏకంగా 6 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓ దశలో 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కోలుకుని నిన్నటి కన్నా ఒక్క శాతం లాభాలతో ముగిసింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 19.20 లక్షల కోట్లు ఉండగా, 7 ట్రేడింగ్ సెషన్లలో 9 లక్షల కోట్లకు పైగా విలువను కోల్పోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. అదానీ గ్రూప్ కు చెందిన స్టాక్స్ కు సంబంధించి కొన్ని సానుకూల సంకేతాలు వెలువడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఓ దశలో 30 శాతం పతనమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ భారీగా కోలుకుని చివరకు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్లు భారీగా పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 909 పాయింట్లు లాభపడి 60,841కి పెరిగింది. నిఫ్టీ 243 పాయింట్లు ఎగబాకి 17,854కి చేరుకుంది.