రాజీనామా చేసిన ఉదయ్ కోటక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 2 Sep 2023 3:45 PM GMTకోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ప్రస్తుతం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహిస్తారు. ఉదయ్ కోటక్ తన రాజీనామా లేఖను బ్యాంక్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపారు.ఉదయ్ కోటక్ రాజీనామా తక్షణమే అమలులోకి వచ్చినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చింది. ఆయన పదవీకాలం డిసెంబర్ 31, 2023 వరకు ఉంది. కానీ నాలుగు నెలల ముందే రాజీనామా చేశారు. తాత్కాలిక ఎండీగా ప్రస్తుత జాయింట్ ఎండీ దీపక్ గుప్తా వ్యవహరించనున్నారు.
1985లో ఎన్బీఎఫ్‌సీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003 నాటికి పూర్తిస్థాయి కమర్షియల్ బ్యాంకుగా మార్చారు. మార్కెట్ క్యాప్ పరంగా కోటక్ మహీంద్రా మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు. సీఈవోగా వైదొలిగినప్పటికీ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. ఏదైనా బ్యాంకు సీఈవోగా పదిహేనేళ్లకు మించి ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. పదవీ విరమణకు కొంచెం గడువు ఉన్నప్పటికీ ఇదే సరైన సమయమని భావించి ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా తనతో పాటు చైర్మన్, జాయింట్ ఎండీ రాజీనామా చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో అధికార మార్పిడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.