త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
By అంజి Published on 22 Jan 2024 6:45 AM GMTత్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి బడ్జెట్ వెల్లడి చేయబడుతుంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ అవసరం. మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు కొన్ని నెలల పాటు ఖర్చులను కొనసాగించడానికి ఆమోదించబడిన తాత్కాలిక బడ్జెట్.
ఆర్థిక సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. కొత్త ప్రభుత్వం సాధారణంగా మే-చివరిలో లేదా జూన్ ప్రారంభంలో బాధ్యతలు తీసుకుంటుంది కాబట్టి, ఈ వ్యవధిలో ఖర్చులు, ఆదాయాలను కవర్ చేయడానికి మధ్యంతర బడ్జెట్ అవసరం. ఆ తర్వాత, జూలైలో, బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం మిగిలిన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. మధ్యంతర బడ్జెట్‌లో కూడా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక అంచనాలు కూడా పొందుపరుస్తారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌లో ఓటర్లను ప్రభావితం చేసేలా పథకాలు ప్రకటించకూడదు. దీంతో ప్రభుత్వాలు ఈ బడ్జెట్‌లో భారీ విధానపరమైన మార్పులను ప్రతిపాదించవు. పన్నుల్లో కూడా పెద్దగా మార్పులు చేర్పులు చేయవు. అయితే, పన్ను విధానానికి చిన్న చిన్న సవరణలు చేయచ్చు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ టాక్స్ డిడక్షన్ పరిమితిని పెంచింది. సాధారణ బడ్జెట్‌కు ముందు ప్రభుత్వాలు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే, మధ్యంతర బడ్జెట్ విషయంలో మాత్రం ఈ ఆనవాయితీకి మినహాయింపు ఉంటుంది.