UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రసక్తే లేదు: కేంద్రం

The central government has said that there is no intention to levy any charges on UPI transactions. యూపీఐ చెల్లింపుల సమయంలో ఛార్జీల వసూలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)

By అంజి  Published on  22 Aug 2022 2:34 AM GMT
UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రసక్తే లేదు: కేంద్రం

యూపీఐ చెల్లింపుల సమయంలో ఛార్జీల వసూలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేసే ఆలోచన తమకు లేదని వెల్లడించింది. ఈ అంశంపై ఆర్‌బీఐ కొన్ని రోజుల నుంచి అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు రావడంతో.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. అయితే యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు తమ సేవల ధరలను తిరిగి పొందేందుకు ఇతర మార్గాలను రూపొందించనున్నట్లు కేంద్రం తెలిపింది.

''యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగపడే డిజిటల్‌ వ్యవస్థ. డిజిటల్ పేమెంట్స్‌ ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలు పెరిగాయి. యూపీఐ సేవలకు ఎటువంటి ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్లు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గతే డాది డిజిటల్‌ పేమెంట్‌ ఎకోసిస్టమ్‌కి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ ఏడాది కూడా అదే సాయాన్ని కొనసాగిస్తున్నట్లు'' ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై టైర్డ్ ఛార్జీలు విధించే అవకాశంతో సహా చెల్లింపుల వ్యవస్థలో ప్రతిపాదించిన వివిధ మార్పులపై ప్రజల నుండి అభిప్రాయాన్ని ఆహ్వానించింది. డిసెంబర్ 08, 2021 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో ప్రకటించినట్లుగా.. సెంట్రల్ బ్యాంక్ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కోసం "చెల్లింపు వ్యవస్థలలో ఛార్జీలు" అనే అంశంపై చర్చా పత్రాన్ని ఆగస్టు 17న ఆర్బీఐ విడుదల చేసింది. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది.

ప్రస్తుతం ఒక రోజులో 21 కోట్లకుపైగా యూపీఐ ఆధారిత చెల్లింపులు జరుగుతున్నాయి. ఎన్‌పీసీఐ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. మొత్తం 338 బ్యాంకులు యూపీఐ లావాదేవీల్లో పాలు పంచుకోగా, రూ.628.8 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. వీటి విలువ రూ.10,62,991.76 కోట్లు. 2021 జులైలో లావాదేవీల సంఖ్య 324 కోట్లు కాగా, విలువ రూ.6,06,281.14 కోట్లే. అంటే ఏడాది వ్యవధిలో లావాదేవీల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇక యూపీఐ లావాదేవీల్లో 50 శాతం వరకు రూ.200లోపు మొత్తానివే ఉంటున్నాయి.

Next Story