భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కుప్పకూల్చాయి. ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, ఒకానొక దశలో 1,700 పాయింట్లకు పైగా పడిపోయింది. చివరకు 1122.33 పాయింట్ల నష్టంతో 79,116 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కీలకమైన 24,500 స్థాయిని కోల్పోయింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి, చివరకు 385.95 పాయింట్ల భారీ పతనంతో 24,480 వద్ద స్థిరపడింది.
భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాభాలతో ఈరోజు గట్టెక్కాయి. టాటా స్టీల్ షేరు అత్యధికంగా నష్టపోయింది. లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఇండిగో ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన షేర్లు కూడా నష్టపోయాయి.