భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను ఈ ఏడాది జూలై 9 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో..
By Medi Samrat
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను ఈ ఏడాది జూలై 9 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం రికవరీని కనబరిచింది. శుక్రవారం సెన్సెక్స్ 1,310 పాయింట్ల లాభంతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ 22,900 స్థాయికి ఎగువకు చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్లలో కొనసాగుతున్న బేరిష్ ట్రెండ్‌తో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,310.11 పాయింట్లు లేదా 1.77 శాతం పెరిగి 75,157.26 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది 1,620.18 పాయింట్లు లేదా 2.19 శాతం పెరిగి 75,467.33 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం పెరిగి 22,828.55 వద్దకు చేరుకుంది. ఇంట్రాడే ట్రేడ్‌లో బెంచ్‌మార్క్ 524.75 పాయింట్లు లేదా 2.34 శాతం పెరిగి 22,923.90కి చేరుకుంది.
వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. ఈ ఏడాది జూలై 9 వరకు 90 రోజుల పాటు భారత్‌పై అదనపు ప్రతీకార సుంకాలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వస్తువులను ఎగుమతి చేస్తున్న దాదాపు 60 దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు. ఈ క్రమంలో భారత్‌పై 26 శాతం అదనపు సుంకం విధిస్తామని కూడా చెప్పారు. అమెరికా చేసిన ఈ ప్రకటన.. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో రొయ్యల నుండి ఉక్కు వరకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ కంపెనీల్లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.