లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం లాభాలతో ప్రారంభమైంది.
By Medi Samrat Published on 20 Jan 2025 11:15 AM ISTదేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 398.21 పాయింట్లు పెరిగి 77,017.54కు చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 105.15 పాయింట్లు పెరిగి 23,308.35 పాయింట్లకు చేరుకుంది. ఇది కాకుండా.. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి 13 పైసలు పెరిగి 86.47 వద్దకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం నికర రూ. 3,318.06 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు తొమ్మిది శాతం పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ లాభాల్లో ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి నష్టాల్లో ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ స్టాండర్డ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.17 శాతం తగ్గి 80.65 డాలర్లకు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు, ఆసియా కరెన్సీల సానుకూల ధోరణితో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి 14 పైసలు పెరిగి 86.46కు చేరుకుంది. శుక్రవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.60 వద్ద ముగిసింది.