జీవితకాలం ఉచిత కాల్స్.. డేటాకు మాత్రమే ఛార్జ్ అనే నినాదంతో సేవలను అందించేందుకు మార్కెట్‌లోకి వచ్చిన రిలయన్స్ జియో కొత్త సంవత్సరం కానుకగా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో మళ్లీ ఉచిత కాల్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చునని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్‌కనెక్ట్ వినియోగ ఛార్జీలు(IUC) రద్దైన అనంతరం మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను పునరుద్దరిస్తామని గతంలో జియో చెప్పింది. ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు కాల్ అందుకున్న నెట్‌వర్క్ కు కాల్ చేసిన నెట్‌వర్క్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్ కనెక్ట్ వినియోగ చార్జీలు అంటారు. ప్రస్తుతానికి ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. 2021 జవనరి 1 నుంచి ఈ విధానాన్ని తొలగించడానికి కేంద్రం గతంలోనే సమ్మతించింది.
నేటితో ఆ గడువు ముగిసిపోతుండడంతో.. జియో మళ్లీ ఉచిత కాల్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్లో కూడా కనిపించింది. ఈ ప్రకటనతో జియో అతిపెద్ద ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్ షేర్లు రెండు శాతం తగ్గాయి.