కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ

సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 6.50 శాతం వద్దనే కొనసాగించింది.

By అంజి  Published on  8 Feb 2024 5:42 AM GMT
RBI, repo rate, Monetary Policy Committee, commercial banks

కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ

సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 6.50 శాతం వద్దనే కొనసాగించింది. రెపో రేటు అంటే ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాల రేటు. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు. మూడు రోజుల చర్చల అనంతరం ఎంపిసి నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ఈ రేటును 6.5 శాతంగా ఉంచాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 6-8 తేదీల్లో ఎంపీసీ సమావేశమైంది. భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని శక్తికాంత దాస్‌ తెలిపారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.

ఆహార ధరలపై ఒత్తిళ్లను ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. దేశ ఆర్థిక కార్యకలాపాల్లోని జోరు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందన్నారు. మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సపోర్ట్‌ వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతాయన్నారు. పట్టణాల్లో వినిమయం బలంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్‌ క్రమంగా పుంజుకుంటోందన్నారు. 2024-25కు జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా వేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం, 2024-25లో 4.5 శాతంగా అంచనా వేసినట్టు తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయని, తద్వారా ముడి చమురు వంటి కమొడిటీ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు.

Next Story