లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్.. కఠిన నిబంధనలకు సిద్ధమైన ఆర్‌బీఐ
లోన్ వసూలు చేయడానికి వెళ్లే బ్యాంకులు, ఆర్ధిక సంస్థల రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన నిబంధనలను విధించేందుకు రెడీ అవుతోంది.
By అంజి Published on 27 Oct 2023 12:03 PM ISTలోన్ రికవరీ ఏజెంట్లకు షాక్.. కఠిన నిబంధనలకు సిద్ధమైన ఆర్‌బీఐ
లోన్ రికవరీకి సంబంధించి రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది. లోన్ వసూలు చేయడానికి వెళ్లే బ్యాంకులు, ఆర్ధిక సంస్థల రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన నిబంధనలను విధించేందుకు రెడీ అవుతోంది. ఆర్థిక సంస్థలు, వాటి రికవరీ ఏజెంట్లు లోన్ రికవరీ కోసం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత లోన్ తీసుకున్నవారికి లేదా హామీదారులకు ఫోన్ చేయకూడదని గురువారం కఠినమైన నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు విధాన రూపకల్పన, కేవైసీ నిబంధనలు నిర్ణయించడం, రుణాల మంజూరుకు సంబంధించి ప్రధాన విధులను ఔట్‌సోర్స్ చేయకూడదని తన ముసాయిదాలో ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు ముసాయిదా మాస్టర్ డైరెక్షన్ నిబంధనలు జారీ చేసింది.
డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు, డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్ల కోసం నియంత్రిత సంస్థలు బోర్డు ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని అనుగుణంగా ఉండాలని ఆర్‌బీఐ సూచించింది. అలాగే ఖాతాదారులతో మాట్లాడే విధానంపై రికవరీ ఏజెంట్లకు శిక్షణ కూడా ఇవ్వాలని సూచించింది. కస్టమర్లకు ఏ సమయంలో కాల్ చేయాలి, కస్టమర్ల సమాచార గోప్యతను ఎలా కాపాడాలి, వివిధ ఉత్పత్తులకు సంబంధించిన నియమ నిబంధనలు కస్టమర్లకు ఎలా వివరించాలి అనే అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. లోన్ వసూలు విషయంలో నియంత్రిత సంస్థలుగానీ, రికవరీ ఏజెంట్లు గానీ వ్యక్తులను భౌతికంగా, మౌళికంగా బెదిరించడం, వేధించడం వంటి చేయకూదని తన ఆర్‌బీఐ ముసాయిదాలో పేర్కొంది. ఈ ముసాయిదాపై వచ్చే నెల 28 లోగా ఆసక్తి గల వర్గాలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని సూచించింది.