వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
RBI likely to keep repo rate unchanged.వడ్డీ రేట్లపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2021 12:39 PM ISTవడ్డీ రేట్లపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.. జూన్‌లో ద్రవ్య విధాన కమిటీ అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి. ఇక, కరోనా సెకండ్ వేవ్ ఎదురుదెబ్బ నుండి కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక రేట్ల జోలికి ఆర్‌బీఐ వెళ్లలేదని స్పష్టమవుతోంది.
ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయం వెల్లడించినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కలిసిరావడంతో తిరిగి మార్కెట్ కోలుకుంటోంది. ఈరోజు ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్ రిపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయింట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్ ట్రేడయ్యింది. మరికాసేపటికే కోలుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 88 పాయింట్ల నష్టంతో 54,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.