కీలక వడ్డీ రేట్లు యథాతథం
RBI keeps key interest rates unchanged.కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతధంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 2:07 PM ISTకీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతధంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. కరోనా ఉద్దృతి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈ సారి కూడా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నట్లు తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగనున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.
మరోవైపు 2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 10.5 శాతంగా ఉంటుంది ఆర్బీఐ అంచనా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గతంలో 26.2 శాతంగా అంచనా వేసినా.. తాజాగా దానిని 18.5 శాతానికి తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్భణం 5.1శాతంగా ఉండొచ్చునని తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ.16వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.