రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లపై యథాతథా స్థితిని కొనసాగించింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించలేదు. రుణగ్రహీతలకు ఊరట కల్పించలేదు. వరుసగా 11వ సారి రెపోరేటును 6.5 శాతం వద్దే ఉంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం తర్వాత శుక్రవారం కీలక ప్రకటనలు చేసింది. గత కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన రెపో రేటుపై గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ప్యానెల్ నిర్ణయాన్ని వెల్లడించింది.
జిడిపి వృద్ధి మందగించడం, అధిక ద్రవ్యోల్బణం వంటి అనేక ఆర్థిక సవాళ్లను భారతదేశం ఎదుర్కొంటున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. ఆహార ద్రవ్యల్బణం ఇంకా ఎక్కువగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ఇయర్ -25కి ఇది ఐదవ MPC సమావేశం. ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్‌లలో మునుపటి సమావేశాలు ఉన్నాయి. అక్టోబర్ సమావేశంలో రెపో రేటును 6.5% వద్ద కొనసాగించడం, వైఖరిని 'తటస్థంగా' మార్చడం, ఇతర కీలక రేట్లను స్థిరంగా ఉంచడం వంటి ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 2023 నుండి RBI రెపో రేటును 6.5% వద్ద మార్చకుండా ఉంచింది.