గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గింపు

వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 9 April 2025 10:34 AM IST

Business News, Reserve Bank Of India, Repo Rate

గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గింపు

వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఏప్రిల్ 7న ప్రారంభమైన మూడు రోజుల సమావేశాన్ని ముగించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 6.25 శాతం నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించింది. దీంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.

కాగా ఐదేళ్ల తర్వాత గత ఫిబ్రవరి నాటి ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరిగిన సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించారు. ఈ మేరకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించింది. ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దశలోనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగొచ్చింది.

ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేట్లను తగ్గించింది. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికాకు కీలక ఎగుమతిదారుగా ఉన్న భారత్‌లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, దేశీయంగా వినియోగం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కొనసాగించేందుకు రేట్లపై ఆర్‌బీఐ కోత విధించింది.

ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత ఇది వరుసగా రెండవ రేటు తగ్గింపు. డిసెంబర్ 2024లో RBI గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజయ్ మల్హోత్రా చేసిన రెండవ ప్రధాన ప్రసంగం కూడా ఇది. ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువగా పడిపోయి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం జరిగింది. డిమాండ్‌కు మద్దతు ఇవ్వడానికి మరియు పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కేంద్ర బ్యాంకు ఈ చర్య తీసుకుంది. లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం కింద స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం (SDF) రేటును 5.75%కి సర్దుబాటు చేశారు మరియు మార్జినల్ స్టాండింగ్ సౌకర్యం రేటు (MSF రేటు)ను 6.25%కి సర్దుబాటు చేశారు.

Next Story