గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.198 మేర తగ్గింది. అలాగే.. కోల్‌కతాలో రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 మేర తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన ధరలు నేటి(శుక్రవారం) నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్ని పరిగణలోకి తీసుకొని ధరల్ని సవరిస్తాయి. అలాగే నేడు(జూలై 1న) కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా సవరించాయి. ధరలు తగ్గిన తరువాత మెట్రో నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2021గా ఉండగా, ముంబైలో రూ.1981, చెన్నైలో రూ.2186, హైదరాబాద్‌లో రూ.2242 కి చేరింది.
ఇదిలా ఉంటే.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మే 19 నాటి ధరలే కొనసాగుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ. 1060 వరకు చెల్లించాల్సిందే.