ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో దాదాపు ఐదు నెలల తరువాత చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై రూ.90పైసలు, డీజిల్‌పై రూ.87 పైసలు పెరిగింది. దీంతో రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ ధర రూ.95.49కి చేరింది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ పై రూ.88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80, డీజిల్ రూ.96.83, గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21, డీజిల్ ధర రూ.97.26కి చేరింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధరలు పెరిగినప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా గత కొద్ది నెలలుగా చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచలేదు. అయితే.. రోజు రోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎన్నికల ముందు అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతీరోజు ఉదయం 6 గంటలకు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను సవరిస్తూ ఉండేవి.