క్రెడిట్ కార్డు vs ప‌ర్స‌న‌ల్ లోన్.. అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో ఏది బెట‌ర్‌..?

మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం ప‌డుతుంది. మ‌న ద‌గ్గ‌ర సేవింగ్స్ లేక‌పోతే.. బ‌య‌ట స్నేహితుల ద‌గ్గ‌ర ప్ర‌య‌త్నిస్తాం.. లేదా క్రెడిట్ కార్డ్ వాడుతాం లేదా ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం ప్ర‌య‌త్నిస్తాం.

By Medi Samrat  Published on  30 Sept 2024 10:02 AM IST
క్రెడిట్ కార్డు vs ప‌ర్స‌న‌ల్ లోన్.. అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో ఏది బెట‌ర్‌..?

మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం ప‌డుతుంది. మ‌న ద‌గ్గ‌ర సేవింగ్స్ లేక‌పోతే.. బ‌య‌ట స్నేహితుల ద‌గ్గ‌ర ప్ర‌య‌త్నిస్తాం.. లేదా క్రెడిట్ కార్డ్ వాడుతాం లేదా ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం ప్ర‌య‌త్నిస్తాం. అయితే ఈ రెండూ అసురక్షిత రుణాలు, వీటికి ఏమి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించాలా లేదా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవడం మంచిదా అనే ప్రశ్న చాలా మందిలో నానుతుంది.

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డులు చాలా మంది జీవితాల్లో భాగంగా మారాయి. వీటితో ముఖ్యమైన బిల్లుల‌ చెల్లింపులతో పాటు షాపింగ్ కూడా చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ATM నుండి నగదును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు, కానీ దానిపై ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సివుంటుంది. అయితే బిల్లుల చెల్లింపు, షాపింగ్‌లో రివార్డ్ పాయింట్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు, వోచర్‌లు, డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందుతారు. ఇవి పర్సనల్ లోన్‌లలో అందుబాటులో ఉండవు.

క్రెడిట్ కార్డ్ వాడితే రుణాన్ని తిరిగి చెల్లించడానికి నిర్ణీత వ్యవధి ఉంటుంది. ఇది మీ బిల్లింగ్ సైకిల్‌పై ఆధారపడి గరిష్టంగా 45 రోజుల వరకూ ఉంటుంది. ఈ వ్యవధిలో బకాయి చెల్లిస్తే.. ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, డిఫాల్ట్ అయితే మాత్రం భారీ వడ్డీ చెల్లించాల్సివుంటుంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది.

ఒకేసారి పెద్ద మొత్తంలో డ‌బ్బు అవసరమైతే.. ప‌ర్స‌న‌ల్ లోన్‌ తీసుకోవాలి. దీనికి కొంత పేప‌ర్ వ‌ర్క్‌ పూర్తి చేయాలి. రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని బ్యాంక్ అంచనా వేస్తుంది. ప్రొఫైల్ క్లియర్ గా ఉంటే.. బ్యాంక్ లోన్ మొత్తాన్ని ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులను కూడా చెల్లించాల్సివుంటుంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ప‌ర్స‌న‌ల్ లోన్‌పై వడ్డీ రేటు హోం లోన్‌, వెహికిల్ లోన్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్దిష్ట సమయానికి ముందే ఒకేసారి మొత్తం చెల్లించి లోన్‌ను క్లోజ్ చేసేయ‌డం కుద‌ర‌దు. అలా చేయాల్సివ‌స్తే.. బ్యాంక్ ప్రీ-పేమెంట్ ఛార్జీని వ‌సూలు చేస్తుంది. అదనంగా.. ప‌ర్స‌న‌ల్ లోన్‌పై GST కూడా ఉంటుంది.

స్వల్ప కాలానికి రూ.20-30 వేలు అవసరం అయితే లేదా పెళ్లి మొదలైన వాటికి షాపింగ్‌ చేయాలనుకుంటే.. క్రెడిట్ కార్డు బెస్ట్ ఆఫ్ష‌న్‌. అంటే చిన్న మొత్తాలకు, తక్కువ వ్యవధిలో చెల్లింపుల‌కు క్రెడిట్ కార్డ్ మంచిది. అంతేకానీ క్రెడిట్ కార్డ్‌పై పెద్ద మొత్తంలో ఖర్చు చేసి.. సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే.. భారీ వడ్డీ రేట్లు అప్పుల పాలు చేస్తాయి.

ఎక్కువ కాలానికి పెద్ద‌ మొత్తంలో డబ్బు కావాలంటే.. ఎక్కడా డబ్బు స‌మ‌కూర‌క‌పోతే పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపాలి. ఇందులో రుణం చెల్లించేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఆదాయం ప్రకారం.. EMIని నిర్ధారించుకోవ‌చ్చు. ఇది రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది.

Next Story