ఊహించని షాక్ ఇచ్చిన పేటీఎం..!
డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytmకు మాతృ సంస్థ 'One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 25 Dec 2023 10:58 AM GMTడిజిటల్ చెల్లింపుల సంస్థ Paytmకు మాతృ సంస్థ 'One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ఖర్చులను తగ్గించుకోడానికి పలు విభాగాలలో పని చేస్తున్న 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. Paytm అక్టోబర్‌లో తొలగింపు ప్రక్రియను ప్రారంభించిందని.. అయితే కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా కొన్ని పనులు పూర్తీ అవుతుండడంతో.. కొందరు ఉద్యోగులను తగ్గించాలని పేటీఎం సంస్థ భావించింది. వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునే ఉద్దేశ్యంతోనే తొలగింపులు జరిగినట్లు తెలుస్తోంది. "మేము AI- ఆధారిత ఆటోమేషన్‌తో మా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం, ఖర్చులను తగ్గించుకోడానికి కొందరిని సంస్థ నుండి తప్పించాం" అని Paytm ప్రతినిధి ఓ మీడియా సంస్థకు తెలిపారు. AI- పవర్డ్ ఆటోమేషన్‌ను ఉపయోగించడం ద్వారా కంపెనీ ఉద్యోగుల ఖర్చులపై 10-15 శాతం ఆదా చేయబోతోందట. దీంతో పనితీరు సరిగా లేని ఉద్యోగులను తొలగించాలని పేటీఎం నిర్ణయించుకుంది.
కొత్త ఉద్యోగాలు కూడా ఉంటాయి :
వచ్చే ఏడాది 15,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాభదాయకమైన వ్యాపార నమూనాతో, మేము భారతదేశంలో పలు ఉద్యోగాలను సృష్టిస్తామని కంపెనీ తెలిపింది.