టమాటా షాకులు.. తట్టుకునేదెలా?
Mcdonalds removes tomatoes from menu parties woo voters with subsidy outlets. దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో తగ్గే సూచనలు అయితే లేవు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2023 8:52 PM ISTహైదరాబాద్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో తగ్గే సూచనలు అయితే లేవు. భారీ వర్షాల కారణంగా టమోటాల కొరత ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో టమాటా పంట దిగుబడి కూడా తగ్గిపోవడంతో రేటు ఊహించనంతగా పెరిగిపోయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ, ధరల పర్యవేక్షణ విభాగం ప్రకారం, జూలై 7, 2023 నాటికి, టమోటా సగటు రిటైల్ ధర కిలోకు రూ. 99.9 గా ఉంది గరిష్ఠ ధర కిలో రూ.180 ఉంది.
టమాటా దగ్గరలో తగ్గే అవకాశం లేదని టమాటాల విక్రేత ప్రసాద్ మోపిదేవి న్యూస్‌మీటర్‌తో అన్నారు. వర్షాల కారణంగా టమాటా సరఫరాకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మరో రెండు వారాల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని అన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి టమాటాలు వస్తాయని.. అప్పుడు ధరలు మళ్లీ గాడిలో పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా పండించే ప్రాంతంగా భావించే మదనపల్లి, అనంతపురం నుంచి ఎక్కువగా టమోటాలు వస్తాయని మోపిదేవి తెలిపారు. ఏ గ్రేడ్ నాణ్యత 18 కిలోల బాక్సు రూ.2,800కు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, బీ గ్రేడ్ రూ.2,300, సీ గ్రేడ్ రూ.1,800 పలుకుతోంది. మదనపల్లె మార్కెట్ లో 25 కిలోల A గ్రేడ్ టొమాటో బాక్స్‌ను రూ. 2,590కి వేలం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మెక్‌డొనాల్డ్స్ లో టమాటోలు లేకుండానే:
టమాట ధరల పెరుగుదల దెబ్బ మెక్‌డొనాల్డ్స్‌కు కూడా తగిలింది. దీంతో మెక్‌డొనాల్డ్స్ ఇక నుంచి తాము అందించే ఆహార పదార్థాల్లో టమాటా ఉండదని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తమ స్టోర్లలో బర్గర్లు, రాప్‌లు సహా వివిధ ఐటెమ్స్‌ల నుంచి టమాటాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో టమాటా లభ్యత తగ్గిపోవడం, సరఫరాలో సమస్యలు, రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్ డొనాల్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వినియోగించే నాణ్యత కలిగిన టమాటాలు దొరకడం లేదని మెక్‌డొనాల్డ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ స్టోర్లలో నోటీసులను అంటించారు. టమాటాలు లేకుండానే తమ ఆహార పదార్థాలను అందించాల్సి వస్తుందని పేర్కొంది. దక్షిణ భారత దేశం, పశ్చిమ భారత దేశంలో ఈ సమస్య లేదని మెక్‌డొనాల్డ్స్ చెప్పింది.
వీధి వ్యాపారులు, కెచప్ తయారీ యూనిట్లకు చిక్కులు:
పెరుగుతున్న టమాటా ధరలతో వీధి వ్యాపారులు, కెచప్‌ల తయారీ యూనిట్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిపాయలు, నిమ్మకాయలు, టమోటాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, తమ ఆహార పదార్థాల రుచిని అలాగే ఉంచడానికి ఏవేవో చేయాల్సి వస్తోందని న్యూస్ మీటర్ తో చెప్పారు. ఉదాహరణకు, ఒక వంటలో 5 కిలోల ఉల్లిపాయలు ఉపయోగిస్తే, ఇప్పుడు 2 కిలోలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇతర పదార్థాలతో మిగిలిన వాటిని భర్తీ చేస్తున్నారు.
విజయవాడకు చెందిన కెచప్ తయారీ యూనిట్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, ఈ ఫీల్డ్‌లోని వాళ్లంతా ముందుగానే టమోటాలను కొనుగోలు చేసి, వాటిని పేస్ట్‌గా మార్చి, నిల్వ చేసుకుంటారు. డిమాండ్, ప్రత్యేక ఆర్డర్‌ల ప్రకారం పేస్ట్ ప్రాసెస్ చేస్తారు. ధరల పెరుగుదల సాధారణంగా రెండు నెలల కంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ధరలు తగ్గుతాయి. అప్పుడు మేము మళ్లీ టమాటాలను కొనుగోలు చేస్తాము.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సైతం తక్కువ ధరలకు టమోటాలు పంపిణీ చేస్తూ రంగంలోకి దిగాయి. ఆంధ్రాలోని విజయవాడలో, తెలుగుదేశం పార్టీ (టిడిపి) కిలో రూ. 30 చొప్పున టమాటాలను పంపిణీ చేసింది. తక్కువ ధరకు టమోటాలు దొరుకుతూ ఉండడంతో ప్రజలు ఎగబడ్డారు.
ఆంధ్రా రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు టమోటాలు:
ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో కిలో రూ. 50 చొప్పున టొమాటోలను విక్రయిస్తోంది. పెరుగుతున్న టమోటా ధరల ప్రభావం ప్రజలపై పడుతుందని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల టమోటాలను కొనుగోలు చేసింది. ఈ టమోటాలు వివిధ రైతు బజార్లలో అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు సబ్సిడీ ధరలలో అందించారు.