మారుతీ సుజుకి సంస్థ తమ కార్లకు సంబంధించి భారీ రీకాల్‌ను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో ముందు వరుసలోని సీట్ బెల్ట్ లోపం కారణంగా ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి చెందిన సియాజ్, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటార్ మోడళ్లలో మొత్తం 9,125 యూనిట్లను రీకాల్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 2-28 తేదీల మధ్య తయారైన వాటిని వెనక్కి పిలవనున్నట్టు మారుతీ సుజుకి తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కార్లలోని ముందు వరుస సీట్ బెల్ట్‌లోని అడ్జస్టర్ అసెంబుల్ ఛైల్డ్ పార్ట్ ఒకదానిలో లోపం ఉందనే అనుమానం ఉందని, దీనివల్ల సీట్ బీల్ట్ విడిపోయే అవకాశం ఉన్నందున కార్లను రీకాల్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. రీకాల్ చేయాల్సిన కార్లకు సంబంధించి వాటి యజమానులకు కంపెనీ నుంచి సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. కార్లను తనిఖీ చేసి లోపం ఉంటే ఉచితంగానే సీట్ బెల్ట్ భాగాన్ని మార్చి ఇవ్వనున్నట్టు మారుతీ సుజుకి స్పష్టం చేసింది.