యాపిల్ సంస్థ iPhone 16 మొబైల్ ఫోన్ ను సెప్టెంబర్ 9న ప్రారంభించనుంది. కొత్తగా ఐఫోన్ 16 సిరీస్ రానుండడంతో అందులో ఎలాంటి ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తుందో అని చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక బడ్జెట్ పరిమితుల కారణంగా కొందరు 2024 ఐఫోన్‌ల ధరలు ఎలా ఉంటాయో అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అధికారిక ధరలు వచ్చే వారం ప్రారంభంలో వెలువడతాయి. అయితే ధరకు సంబంధించిన లీక్స్ మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి.
ఆపిల్ హబ్ ఇటీవలే ఐఫోన్ 16 సిరీస్ ధరలను లీక్ చేసింది. ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర $799 (సుమారు రూ. 67,100)గా ఉండవచ్చని, ఐఫోన్ 16 ప్లస్ ధర $899 (దాదాపు రూ. 75,500), ఐఫోన్ 16 ప్రో 256GB వేరియంట్ కోసం $1,099 (సుమారు రూ. 92,300)గా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే అల్ట్రా-ప్రీమియం ఐఫోన్ 16 ప్రో మాక్స్ $1,199 (సుమారు రూ. 1,00,700) నుండి ప్రారంభమవుతుంది. అమెరికా మార్కెట్‌లో లీక్ అయిన ధరలు ఇవి. అయితే భారత్ లో ఈ ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతేడాది ఐఫోన్ 15 ప్రో భారతదేశంలో రూ. 1,34,900, ప్రో మాక్స్ రూ. 1,59,900 వద్ద ప్రకటించారు. కాబట్టి ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌ల ధర అంతే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.