కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ కోలుకుంటుంది. అందుకు ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లే నిదర్శనం. ఫిబ్రవరి నెలలో రూ.1.33 లక్షల కోట్లు వసూలు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో(ఫిబ్రవరి) తో పోలిస్తే 18 శాతం అధికం. ఇక ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్‌టీ చరిత్రలో ఇది ఐదోసారి. అయితే.. ఈ ఏడాది జనవరి నెల రూ.1.40 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం కాస్త తగ్గాయి.
ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూలు వచ్చాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వసూళ్లు తగ్గడానికి కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఓ కారణమని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఫిబ్రవరిలో 28 రోజులు ఉండడం ఇంకొ కారణం అని చెప్పింది. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్‌టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ.67,471 కోట్లు వచ్చాయి. దిగుమతుల ద్వారా రూ.33,837 కోట్లు, సెస్ రూపంలో రూ.10,340 కోట్లు వచ్చాయి.