హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై గూడ్స్ అండ్ ట్యాక్స్‌ని (జీఎస్‌టీ)ని మినహాయించాలని కోరుతున్న పాలసీదారుల ఆశలు నెరవేరేలా కనబడుతున్నాయి. రాబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. శనివారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో దీని గురించి చర్చించినట్టు సమాచారం. ఈ పాలసీలపై జీఎస్‌టీ తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్‌టీ రద్దు ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలగనుంది. ఇదే అంశాన్ని జీఓఎంలోని మెజార్టీ సభ్యులు సమర్థించినట్టు తెలుస్తోంది.
సామాన్య వ్యక్తులు తీసుకునే రూ.5 లక్షల లోపు ఆరోగ్య బీమా పాలసీలపైనా జీఎస్‌టీని మినహాయించాలని నిర్ణయించారు. రూ.5 లక్షలపైన ఆరోగ్య బీమా పాలసీలకు 18 శాతం జీఎస్‌టీ కొనసాగించాలని నిర్ణయించారు. టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్ రద్దు చేయాలనిప ప్రతిపాదించామని, దీనిపై సమగ్ర రిపోర్ట్‌ను జీఎస్‌టీ మండలికి సమర్పిస్తామని జీఓఎం జీవిత, ఆరోగ్య బీమా కన్వీనర్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. ఆరోగ్య బీమా పాలసీలపైన జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడం వల్ల అందరికీ బీమా లక్ష్యం నెరవేరుతుందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.