ప్రజలకు స్వల్ప ఊరట లభించనుంది. వంటనూనెల ధరలు వారం రోజుల్లోగా లీటరుకు రూ.10 వరకు తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో ఆమేరకు వినియోగదారులకు లబ్ది చేకూర్చాలని వంట నూనెల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఒక బ్రాండ్ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది.
కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే బుధవారం నూనెల తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా రేట్లు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలని, ఎంఆర్‌పీని తగ్గించాలని సూచించినట్లు తెలిపారు. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి దిగుమతి చేసుకునే అన్ని రకాల వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గిస్తామని ప్రధాన తయారీ సంస్థలన్నీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇక తూకం విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులపై కూడా తయారీ సంస్థలతో చర్చించినట్లు వెల్లడించారు.
కాగా.. దేశ వంట నూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతులే తీరుస్తున్నాయి. గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా వంట నూనెలకు డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో నాలుగైదు నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. దీంతో గత నెలలో నూనె ధర లీటర్‌కు రూ.10 నుంచి 15 వరకు తగ్గించాయి కంపెనీలు.