పెరిగిన బంగారం, వెండి ధరలు.. కార‌ణం ఏమిటంటే..

నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది

By Medi Samrat  Published on  3 Oct 2024 2:13 PM GMT
పెరిగిన బంగారం, వెండి ధరలు.. కార‌ణం ఏమిటంటే..

నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిన‌ట్లు భావిస్తున్నారు. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.78,300కి చేరుకుంది. ఇది ఇప్పటికీ అత్యధిక స్థాయిలో ఉంది. ఈ వారంలో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,100 వద్ద ముగిసింది. అదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.77,900కి చేరుకుంది.

వెండి కూడా కిలోకు రూ.665 పెరిగి రూ.93,165కి చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.92,500గా ఉంది. 'నవరాత్రి' ప్రారంభంలో బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. హిందూ పురాణాలలో, నవరాత్రులలో కొత్త వస్తువులను, ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.

బులియన్ మార్కెట్ మూడ్ గురువారం అంత‌గా బాలేదు. బుధవారం అమెరికా స్టాక్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల కారణంగా బంగారం ధరలు కూడా పెరిగాయి. గురువారం విడుదల అయిన‌ జాబ్‌లెస్ క్లెయిమ్‌లతో సహా US ఉద్యోగాల డేటాపై కూడా పెట్టుబడిదారులు ఒక కన్నేసి ఉంచుతారు. ఈ డేటా బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు.

ఆసియా ట్రేడింగ్ అవర్స్‌లో Comex బంగారం 0.17 శాతం తగ్గి ఔన్స్‌కు US $ 2,665.20 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఔన్సు వెండి 0.36 శాతం తగ్గి 31.81 డాలర్లకు చేరుకుంది.

Next Story