బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ఇన్వెస్టర్లు భారీ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.44 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,41,400 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు యథాతథంగా ఉంటూ కిలోకు రూ.2,68,926 వద్ద నిలిచింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర సోమవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ.1,40,482గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 4,600 డాలర్ల మార్కును దాటింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌లో రాజకీయ అస్థిరత వంటి అంశాలు కూడా బంగారం ధరలకు మద్దతునిస్తున్నాయి.