అంబానీని దాటేశారుగా..!
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుబేరుల రేసులో దూసుకుపోతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
By Medi Samrat Published on 5 Jan 2024 5:45 PM ISTఅదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుబేరుల రేసులో దూసుకుపోతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. `హిండెన్‌బర్గ్` ఆరోపణలతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు కుప్ప కూలిపోయాయి. ఆసియా కుబేరుడిగా ఉన్న అదానీ ఒక్కసారిగా 35వ స్థానానికి పడిపోయారు. ఆ సంక్షోభం నుంచి బయట పడడానికి అదానీ అనేక చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ గాడిన పడ్డాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాఫ్తు మినహా మరే ఇతర దర్యాఫ్తూ అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు రావడంతో అదానీకి మరింత ప్లస్ గా మారింది. దీంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక్కరోజులోనే గౌతమ్ అదానీ సంపాదన 7.7 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (97 బిలియన్ డాలర్లు)ని దాటేసి అసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానానికి చేరుకోగా, అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.
జనవరి 5న, గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ $97.6 బిలియన్లు కాగా, ముఖేష్ అంబానీ $97 బిలియన్ల నికర విలువతో కేవలం ఒక స్థానం దిగువన ఉన్నారు. అదానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత సంపదను కూడబెట్టిన సంస్థలో ఒకటిగా కూడా మారింది. జిందాల్ స్టీల్‌కు చెందిన సావిత్రి జిందాల్ అత్యధిక సంపదను ఆర్జించింది. అయితే ముఖేష్ అంబానీ దాటారు. ఇప్పుడు, గౌతమ్ అదానీ తన సంపదను తిరిగి సొంతం చేసుకున్నారు.