ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ (డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా) తెలిపింది. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నసంగతి తెలిసిందే. కాగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ధరల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆ సంస్థ పార్ట్‌నర్ దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు పెంచడం లేదని తెలుస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఆ తరువాత లీటర్‌పై రూ. 8 నుంచి 9 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందన్నారు. ఇక పెట్రోల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు.