సామాన్యుడిపై పెట్రో భారం ఇప్పట్లో తగ్గేట్టుగా లేదు. నేటితో కలిపి గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీల్లో పెట్రోల్ లీటరు ధర రూ.98.61కి, డీజిల్ లీటరు ధర రూ.89.87కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35కాగా, డీజిల్ ధర రూ.97.55 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ మంట కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80, డీజిల్ ధర రూ.98.10కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60, డీజిల్ ధర రూ.99.50కి పెరిగింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా దాదాపు 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రో వడ్డింపు ప్రారంభమైంది. గత ఐదు రోజుల్లో రూ.3.20 మేర ధరలను పెంచారు. ధరల పెంపు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.