వంట నూనె ధరలు మరింత తగ్గనున్నాయి. రానున్న రోజుల్లో ఎడిబుల్ ఆయిల్ రేట్లు ఇంకా తగ్గుతాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్ ఉత్పత్తిదారులతో సమావేశం నిర్వహించింది. వంట రూనె ధరలను విక్రయించే కంపెనీలు ఆయిల్ రేట్లను లీటరుకు రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గించేందుకు అంగీకారం తెలిపారని నివేదికలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి రావడంతో దేశంలో కూడా ఆయిల్ రేట్లను తగ్గించాలని భారత ప్రభుత్వం ఆయిల్ దిగుమతి దారులు, తయారీ కంపెనీలతో సమావేశం నిర్వహించింది. కంపెనీలు అన్నీ సానుకూలంగా స్పందించాయి.
గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గిన నేపథ్యంలో వంట నూనె ధరలు లీటరుకు రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గనున్నాయని సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనూ.. ఇండోనేసియా ఇతర దేశాలకు పామ్ ఆయిల్ ఎగుమతులపై బ్యాన్ విధించడంతో మన దేశంలో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలను మరింత తగ్గించేందుకు ఆయిల్ ఉత్పత్తి కంపెనీలతో సమావేశం నిర్వహించింది. గత నెలలో కూడా ఇలానే కేంద్రం మ్యానుఫ్యాక్చరర్స్, రిఫైనర్స్, డిస్ట్రబ్యూటర్లతో సమావేశం నిర్వహించింది.