ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘన..'మింత్రా'పై ఈడీ కేసు
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది.
By Knakam Karthik
ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘన..'మింత్రా'పై ఈడీ కేసు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలను ఉల్లంఘించినందుకు మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని సంబంధిత సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.1,654 కోట్ల విలువైన విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కేసును దాఖలు చేసింది. ED బెంగళూరు జోనల్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రకటన ప్రకారం..మింత్రా హోల్‌సేల్ 'క్యాష్ అండ్ క్యారీ' మార్గాన్ని దుర్వినియోగం చేసి, ఎఫ్‌డీఐ విధానంలో నిషేధించబడిన మల్టీ-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (MBRT) నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణం ప్రత్యక్ష వినియోగదారు రిటైల్‌పై విధించిన FDI పరిమితులను అధిగమించడానికి ఉపయోగించబడిందని, తద్వారా FEMA, 1999 నిబంధనలను ఉల్లంఘించిందని ఏజెన్సీ ఆరోపించింది.
ఈ నిర్మాణం బీ2బీ, బీ2సీ కార్యకలాపాలను విభజించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించేలా రిటైల్ ట్రేడ్‌లో నిమగ్నమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2010, అక్టోబర్ 1, 2010 నాటి ఎఫ్‌డీఐ విధాన సవరణల ప్రకారం.. హోల్‌సేల్ విక్రయాలలో కేవలం 25% మాత్రమే గ్రూప్ కంపెనీలకు వెళ్లాలనే నిబంధనను మింత్రా ఉల్లంఘించినట్లు ఈడీ తేల్చింది. మింత్రా, ఇతరులు ఫెమా సెక్షన్ 6(3)(బి)తో పాటు ఏకీకృత ఎఫ్‌డీఐ విధానాలను అతిక్రమించినట్లు ఈడీ నిర్ధారించింది, దీని ఫలితంగా మొత్తం రూ. 1,654.35 కోట్ల ఉల్లంఘన జరిగినట్లు తేలింది. మింత్రా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (FDI) హోల్‌సేల్ ట్రేడింగ్ కోసం పొందినట్లు పేర్కొన్నప్పటికీ.. ఎక్కువ భాగం విక్రయాలను సంబంధిత సంస్థ అయిన వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్మినట్లు ఈడీ గుర్తించింది.