బడ్జెట్ 2026-27కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రాలు, శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం జనవరి 10, 2026 మధ్యాహ్నం 3 గంటల నుంచి న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ది అశోక్ హోటల్ – బాంక్వెట్ హాల్ (3వ అంతస్తు)లో జరుగనుంది.
ఈ సమావేశం ద్వారా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి బడ్జెట్‌కు సంబంధించి సూచనలు, అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇది బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ప్రీ-బడ్జెట్ సంప్రదింపులలో భాగమని ఆర్థిక వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాత్రమే మీడియా ఫోటోగ్రాఫర్లకు అనుమతి ఇవ్వనున్నారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో ఎలాంటి మీడియా కవరేజ్ ఉండదని, మీడియా ప్రతినిధులను ఆహ్వానించబోమని స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం PIB ద్వారా అధికారిక ప్రెస్ రిలీజ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.