బడ్జెట్ 2024: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవే
2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది.
By అంజి Published on 23 July 2024 8:33 AM GMTబడ్జెట్ 2024: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవే
2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది. ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. దీంతో కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గింది. ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాలలో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానంలో మాత్రమే కొన్ని మార్పులు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను స్లాబ్ రేట్లను సవరించింది. రూ.0-3 లక్షల వరకు పన్ను లేదు. రూ.3-7 లక్షల వరకు 5 శాతం, రూ.7-10 లక్షల వరకు 10 శాతం, రూ.10-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం, ఆపైన 30 శాతం వరకు పన్ను విధిస్తారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచామని వెల్లడించారు. ఆదాయపన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి మారే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా ఈ విధానంలో వేతన జీవులకు రూ. 17,500 పన్ను ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్‌పై డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉన్న డాటా ప్రకారం.. మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.61 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలయ్యాయి.